నిన్న మ్యాచ్ ముగిసిన తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్. ధోనిని కామెంటేటర్ గా ఉన్న మురళీ కార్తీక్ ఓ ప్రశ్న అడిగాడు. నీకు లాస్ట్ టైమ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎప్పుడు వచ్చిందని. దానికి ధోనీ నవ్వుతూ అసలు నాకు ఇవాళ కూడా ఎందుకిచ్చారు అన్నాడు. నూర్ అహ్మద్ బౌలింగ్ బాగా చేశాడు తనకు వస్తుందనుకున్నా అని చెప్పాడు. దానికి మురళీ కార్తీక్ సమాధానం చెప్పాడు. నీ ఆట సీఎస్కేకు మంచి చేస్తుంది. సీఎస్కే బాగుంటే ఐపీఎల్ కూడా బాగున్నట్లే అన్నాడు మురళీ కార్తీక్. కార్తీక్ మాటలను జస్టిఫై చేసేందుకు రెండు రీజన్స్ ఉన్నాయి. అవే ధోనికి ఆరేళ్ల తర్వాత ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రావటానికి కూడా కారణం అయ్యాయి. మొదటి రీజన్ ధోని ప్రదర్శన ఓ ఆటగాడిగా..అండ్ కెప్టెన్ గా. నాయకుడిగా మారాక ఈ సీజన్ లో ఇది ధోనీకి రెండో మ్యాచ్. వరుసగా వచ్చిన ఓటములను దాటి టీమ్ ను సెట్ రైట్ చేసుకోవటానికి…. ఏం వర్క్ అవుతున్నాయి ఏం వర్క్ అవ్వట్లేదు అని చూసుకోవటానికి ధోనికీ ఓ మ్యాచ్ టైమ్ పట్టింది. తన ఆలోచనల్లో భాగంగానే నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్ లో ధోనీ చేసిన మార్పులు. సీఎస్కే అంటే ధోనీ, జడేజా లతో పాటు గుర్తొచ్చేది రవిచంద్రన్ అశ్విన్. ఫామ్ లో లేని కారణంగా అలాంటి అశ్విన్ ను పక్కన పెట్టేశాడు మాహీ. రెండోది కాన్వే లాంటి ఫారెన్ ప్లేయర్ ని కాదనుకుని రషీద్ అనే గుంటూరు కుర్రోడిని టీమ్ లో కి ఓపెనర్ గా తీసుకోవటం. టీమ్ సెలక్షన్ మీద ధోని సారించే దృష్టికి ఇది ఉదాహరణ. ఇందులోనే ప్లేయర్ గా ధోని పోషించిన క్రూషియల్ రోల్. కెప్టెన్ గా వికెట్ కీపర్ గా రెండు బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఫీల్డ్ ప్లేస్మెంట్ లు బౌలర్లను మారుస్తూ లక్నోకు పరుగులు రాకుండా చేయకుండా లాంటివి చేస్తూనే ఓ ఆటగాడిగా తన వ్యక్తిగత ప్రదర్శనను చూపించాడు ధోనీ. బడోనీ చేసిన స్టంప్ అవుట్ కానీ...అబ్దుల్ సమద్ ను చేసిన రనౌట్ కానీ...పంత్ ఇచ్చిన క్యాచ్ ను పట్టటం కానీ..ఫినిషర్ గా 200 కు పైగా స్ట్రైక్ రేట్ తో ఆడి 5 ఓవర్లలో 55 కొట్టేలా సీఎస్కే టీమ్ ను నిలబెట్టడం కానీ ధోనీని ఈ అవార్డుకు ఆరేళ్ల తర్వాత అర్హుడిని చేశాయి. ఇక దీనికే రెండో రీజన్ ఉంది. ఐపీఎల్ అనేది ఫక్తు కమర్షియల్. క్రికెట్ ఆటకు తోడ్పడేది కానీ దాని చుట్టూ ఉన్నదంతా బిజినెస్. అలాంటి బిజినెస్ లో టాప్ ప్లేయర్స్ అంటే చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, ఆర్సీబీ. ఈ మూడు జట్లకు వచ్చే రెవెన్యూనే టోర్నీని సక్సెస్ చేయటానికి కారణం. మరి అలాంటి ముంబై, చెన్నై టీమ్ లు ఈ సీజన్ లో ఊహించని స్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నాయి. చెన్నై కి వరుసగా ఐదు ఓటములతో ఫ్యాన్స్ అంతా కంప్లీట్ గా డల్ అయిపోయారు. ధోనిని చూడాలని ప్రాంతాలతో సంబంధం లేకుండా మ్యాచ్ లకు వచ్చేవాళ్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి టైమ్ లో మళ్లీ ధోనీ ఫీవర్ ను ఫ్యాన్స్ లో కలిగించాల్సిన అవసరం ఉంది. అందుకే ధోనీ ఆడిన ఆటను గౌరవిస్తూ అతనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ను ఇవ్వటం ద్వారా ఐపీఎల్ చరిత్రలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న అతిపెద్ద వయస్కుడైన ఆటగాడిగా రికార్డు కల్పించటంతో పాటు పడిపోతున్న ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూను ధోనీ ఫినిషింగ్ సిక్సర్ లా తట్టి లేపే ప్రక్రియలో భాగమే ధోనికి ఈ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు. అందుకే కార్తీక్ అన్నాడు. నువ్వు ఆడితే సీఎస్కేకి మంచిది. సీఎస్కే ఆడితే ఐపీఎల్ కే మంచిది అని.